ఇప్పటికే ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయం, అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఇనోవియోతో కలిసి సంయుక్తంగా రూపొందించిన వ్యాక్సీన్‌ను జంతువులపై పరీక్షించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించింది.
ప్రస్తుతం తమ దేశంలో తయారైన వ్యాక్సీన్ సత్ఫలితాన్నిస్తే మానవులకు వరంగా మారనుందని ఆస్ట్రేలియా నేషనల్ సైన్స్ ఏజెన్సీ భావిస్తోంది.
అమెరికాలో తొలిసారిగా గత నెలలోనే జంతువులపై ప్రయోగించకుండానే మానవులపై పరీక్షలు నిర్వహించారు.
ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రస్తుతం కోరనావైరస్ విరుగుడుకు వ్యాక్సీన్ కనుగొనేందుకు ప్రయత్నాలు శరవేగంగా సాగుతున్నాయి.
అయితే తాము నిర్వహిస్తున్న పరీక్షలు మరింత సమగ్రమైనవని ఆస్ట్రేలియా కామన్ వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్(సీఎస్ఐఆర్‌ఓ) తెలిపింది.
ఈ విషయంలో ఈ స్థాయిలో ప్రపంచ దేశాల సహకారం, పరిశోధనల్లో ఇంత వేగం ఏమాత్రం ఊహించలేదని, ఇదో అసాధారణమైన ప్రక్రియ అని పరిశోధకులు చెబుతున్నారు.
“సాధారణంగా ప్రయోగాలు ఈ స్థాయికి చేరుకునేందుకు కనీసం ఒకటి నుంచి రెండేళ్లు పడుతుంది. కానీ కొద్ది నెలల్లోనే ఇప్పుడు ఇది సాధ్యమయ్యింది” అని సీఎస్ఐఆర్‌ఓకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ రోబ్ గ్రీన్‌ఫెల్ మీడియాతో అన్నారు.