కరోనావైరస్ లాక్‌డౌన్: తెలంగాణలో మద్యం దొరక్క మందుబాబుల వింత ప్రవర్తన, ఎర్రగడ్డ ఆస్పత్రికి పెరిగిన రద్దీ

లాక్‌డౌన్ కారణంగా మద్యం దొరక్కపోవడంతో వింతగా ప్రవర్తిస్తున్న వారితో కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మానసిక వైద్యశాల కిటకిటలాడుతోంది. మానసిక అశాంతి, మూర్ఛ వంటి లక్షణాలతో వచ్చేవారి సంఖ్య పెరిగిందని ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు.


మార్చి 30 నుంచి ఇప్పటి వరకు 200కు పైగా మంది చికిత్స కోసం ఎర్రగడ్డ ఆస్పత్రికి వచ్చారని మానసిక వైద్యులు డాక్టర్ రవి కిషోర్ బీబీసీతో చెప్పారు. కొంతమందికి అదే రోజు చికిత్స అందించి పంపిస్తున్నారు. మరికొందరికి మాత్రం అత్యవసర వైద్య సేవలు అందించాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్నారు.


సోమవారం నిజామాబాద్‌లో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, ఇది మొదటి సంఘటన కాదని పోలీస్ అధికారులు తెలిపారు. గతవారం హైదరాబాద్‌లో కూడా ఒక వ్యక్తి మద్యం దొరకలేదని మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.